విష నాగు… మరో విష నాగు…
తెలంగాణ సమాజాన్ని, మానవ సంబంధాల్ని, సంస్కృతిని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షనీ అనహేళన చేస్తూ విషం చిమ్మిన సినీ విష నాగు.
అది కందిరీగ రూపంలో ముందుకొచ్చింది.
55 ఏళ్ళ ముదనష్టపు సమైక్య రాష్ట్రంలో ఎద నిండా గాయాలూ, గుండె కోతలూ తెలంగాణకు కొత్త కాకపోయినా ఆంధ్రా ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఈ ప్రాంతం ప్రశ్నిస్తోన్న, ప్రతిఘటిస్తోన్న తరుణంలో ఆ విషనాగు ‘కందిరీగ’ వేషం కట్టి తెలంగాణలో తిరుగుతోంది . ఇది ఆంధ్రా జాత్యాభిజాత్యానికి, అహంకారానికి తిరుగులేని ఉదాహరణ, ప్రతినిధి. అయినా ఈ ఘోర అవమానాన్ని గుర్తించలేని, గర్హించలేని అమాయకత్వం తెలంగాణ ప్రజలది.
కథ లోకి పోతే, కథానాయకుడి ఊరు, ఇంకెక్కడా… అదే ఆంధ్రా, అదే అనకాపల్లి. తల్లితండ్రులు 23 ఏళ్ళ వయసొచ్చినా తనకు పెళ్లి చేయడంలేదని ఆ విషయంతో ఏ విధంగానూ సంబంధం లేని ఒక అమ్మాయిని పెళ్లి పీటల మీదినించి ‘లేపుకొస్తాడు’. ఇది ‘హీరో’ పరిచయపు సన్నివేశం. ఆ తర్వాత డిగ్రీ కూడా పాసవని వాణ్ని పెళ్లి చేసుకోనని తన మరదలు చీదరించుకోవడంతో రేషంతో శపథం చేసి ట్రైనులో హైదరాబాదు బయలుదేరతాడు. అదే ట్రైనులో, అదే అనకాపల్లిలో తెలంగాణా యాసలో మాట్లాడే ఈవ్ టీజర్స్ బారి నుండి అమ్మాయిల్ని రక్షించి, ఆ రౌడీలకు ‘అమ్మాయిల్ని అల్లరి చెయ్యాలి కాని, అల్లరిపాలు చెయ్యకూడదు’ అని గీతోపదేశం చేస్తాడు. అంతే! ఆ ‘హీరోచిత’ ఫైటింగుకు, తర్వాతి ప్రవచనానికి అమ్మాయిలంతా ఫ్లాట్! మన ఖర్మ కాలి అలా ‘పడిపోయిన’ వారిలో మన తెలంగాణకు, వరంగల్లుకు చెందిన అమ్మాయీ ఉంటుంది.
హైదరాబాదు చేరుకున్న హీరో గారు(శీను) కాలేజీలో చేరతారు. అక్కడ మొదటి చూపులోనే శృతి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
విశేషమేమిటంటే ఈమె తండ్రి ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగి. ఆ ప్రస్తావన ఎందుకో తర్వాత చెప్తాను. ఇహ షరా మామూలుగానే విలన్లూ, ఫైటింగులూ ! మొత్తానికి హీరో తన చచ్చు, పుచ్చు ‘అతి తెలివితో’ తన ప్రేయసిని రక్షించుకుంటాడు. సుఖాంతమయ్యిందనుకున్న కథ మరో మలుపు తిరుగుతుంది. అప్పటికి ఒక గంటే అయ్యింది మరి!
శ్రుతిని వరంగల్ రాజన్నకు చెందిన మనుషులు కిడ్నాప్ చేస్తారు. అనకాపల్లిలో హీరో గారి వీరోచిత యుద్ధ ప్రావీణ్యానికి, ప్రవచనానికి ‘పడిపోయిన’ అమ్మాయిల్లో ఈ రాజన్న కూతురు ఒకరు. ఆమె శీనుగాడిని తప్ప మరెవర్నీ పెళ్ళిచేసుకోనని జిద్దుకు కూర్చుంటుంది. శ్రుతిని కిడ్నాప్ చేస్తే, ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి శీను కూడా వరంగల్లుకు వస్తాడు.
అదీ లింకు. అదే జరుగుతుంది. కాకతీయ తోరణమున్న ఒక పెద్ద భవనంలో రాజన్న మందీ మార్బలంతో ఉంటాడు. గమ్మత్తేమిటంటే ‘రాయలసీమ’ ‘మర్యాద రామన్న’ సినిమాను చిత్రీకరించిన ఇంటి లోనే ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇదేం అపరాధం కాదు కానీ, రాయలసీమ ప్రాంత గృహ నిర్మాణ పధ్ధతి ప్రతిబింబించేలా సెట్ వేసుకున్నామని చెప్పుకున్న ఇంట్లో తెలంగాణ ప్రాంతమని చెప్పి షూట్ చేయడాన్ని బట్టి దర్శకుడికి టేస్ట్, శ్రద్ధ, నిజాయితీ వంటివేవీ లేవని రుజువవుతుంది. మొత్తానికి ఒక తోరణాన్ని ఇంటి ముందర పెట్టి వరంగల్ అనిపించారు, కథ నడిపించారు.
ఇహ ఇక్కడ మొదలౌతుంది విష నాగు విశ్వరూపం! సారీ! అదే ‘కందిరీగ’ విశ్వరూపం!
మొట్ట మొదటి సీన్ నుంచే రాజన్న కూతురిని (సంధ్య) ఒక తెలివితక్కువదానిలా చూపిస్తాడు దర్శకుడు (అమాయకత్వానికి, తెలివితక్కువతనానికి చాలా తేడా ఉంది!).
హీరో గారు కూడా ‘తింగరబుచ్చి’, ‘ఇంత వయోలెంట్ గా ఎలా పుట్టావే!?’ అని అనడం ద్వారా, ఇంకా అసహనం, అవహేళన కూడిన వాచికం, అభినయంతో ఈ విషయంలో మనకేమైనా అనుమానలుంటే పూర్తిగా నివృత్తి చేస్తాడు. ఇక సంధ్యకు తనపై ఉన్నది ప్రేమ కాదనీ, ఇష్టం మాత్రమేనని, నిజమైన ప్రేమ కలిగితే గుండె గంటలు మోగుతాయని జ్ఞానోదయం ప్రసాదిస్తాడు. అయితే తర్వాతి సన్నివేశంలో హీరోకి బద్ద శత్రువైన భవానీని అనుకోకుండా గుద్దుకుంటుంది సంధ్య. భవానీ సంధ్యను కింద పడకుండా పట్టుకుంటాడు. చూపులు కలుస్తాయి. అదే సమయంలో ఇంటి బయట ఒక ఎద్దు మెడలో కట్టిన గంటలు మోగుతాయి. ‘గంట మోగింది’ కాబట్టి అదే ప్రేమ అనుకునేంత ఎడ్డిదానిగా (తెలంగాణా, వరంగల్ పిల్ల కదా!) చూపిస్తాడు దర్శకుడు. దార్శనికుడు మరి! ఇది చాలదన్నట్టు చివర్లో సంధ్యకు నత్తి అనే మరో ఆభరణం తగిలిస్తాడు. ఎందుకంటే విలన్ భవానీకి కూడా నత్తి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ సరిజోడని వారి అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే రాజన్న, భవానీ ఇద్దరూ గూండాలే కదా! మరి చిల్లర మల్లర గాడైన శీనుకి, ‘ఆంధ్రా’ బ్యాంకు ఉద్యోగి కూతురెందుకో? ‘రాయలసీమ మురిసిపడేలా’ రామినీడు కూతురు ‘తెలుగమ్మాయి’ అయినట్టు, ‘తెలంగాణ’ మురిసిపడేలా రాజన్న కూతురు ఎందుకు ‘తెలుగమ్మాయి’ కాలేకపోయింది? ‘తెలివితక్కువదెందుకయ్యింది’? ఎందుకంటే ఇది ‘సమైక్య’ రాష్ట్రం కాబట్టి!
‘ఇల్లే ఇంత అందంగా ఉంటే బావగారెంత అందంగా ఉంటారో’ అని ముందు చంద్ర మోహన్ పాత్రతో అనిపించి వెంటనే మర్డర్ చేసిన కత్తి రక్తంతో కాబోయే వియ్యంకుడికి రాజన్నచే తిలకం దిద్దిస్తాడు దర్శకుడు. రాజన్న పాత్రను జయప్రకాశ్ వేశారు. అలవాటులో పొరపాటుగా ఇది రాయలసీమ సినిమా అనుకున్నాడేమో పాపం దర్శకుడు! ఒక అమర్యాదస్తుడిగా, సంస్కారంలేని వ్యక్తిగా రాజన్నను చిత్రిస్తాడు. అక్కడితో అయిపోదు. కాబోయే మామగారిని సంధ్యకు పరిచయం చేస్తాడు రాజన్న. అదేమీ పట్టించుకోకుండా, కనీసం పలకరించకుండా కేబులోన్ని ‘బొక్కల నూకు’ మంటుంది సంధ్య. తెలంగాణా అమ్మాయిని మర్యాద తెలిసిన వ్యక్తిగా చూపించడం ఇష్టం లేదు కావొచ్చు దర్శకుడికి.
ఇది టూ మచ్ అంటారా? వెంటనే తండ్రి నమస్కరించమంటే సంధ్య ఏమంటుందో చూడండి. ‘ చల్… గా పొట్టి సాలెగాడు… గానికి నేను మొక్కుడేంది? నేన్మొక్కా..’ దానికి రాజన్న ‘అర్రే.. గాయన నీ మామ… మంచిగుండది…’ అంటాడు. అయితే తర్వాత సన్నివేశంతో లిబరల్స్ ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా విషయం అర్థం అయ్యేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. శ్రుతిని తన తండ్రికి పరిచయం చేస్తాడు శీను. వెంటనే శృతి ‘పద్ధతిగా’ కాబోయే మామకి నమస్కరిస్తుంది. ఎంతయినా ‘ఆంధ్రా’ బ్యాంకు ఉద్యోగి కూతురు కదా! వినయం, విధేయత, సంస్కారం అన్నీ ఆంధ్రా వారి గుత్త సోత్తాయే!
ఈ సినిమాలో తెలంగాణ ప్రాంత వేషధారణ చేసిన వారు వింత వింతగా కన్పిస్తుంటారు. ఉదాహరణకు రాజన్న శత్రువు ఒకడు అడుగు స్థలం కోసం 500 ఎకరాల భూమిని అమ్ముకుంటాడు. పరువుకోసం అన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. అంత ఎర్రోడు అని అయ్యవారి అభిప్రాయం. వేల ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ గద్దలనుండి ఎలా కాపాడుకోవాలో తెలంగాణ వారికి తెలియకపోవడం నిజంగా ‘ట్రాజిడీయే’! దాన్ని కూడా కామెడీ చేయగల ప్రజ్ఞా పాటవాలు కేవలం ఆంధ్రా వారికే ఉన్నాయి. అట్లే ఈ పాత్రధారులు మాట్లేడే యాస కూడా చాలా చికాకు పెడుతుంది. సంధ్య ఎన్నిసార్లు ‘చల్’ అన్నదో, రాజన్న ఎన్నిసార్లు ‘తోడ్కలు తీస్తా’ నన్నాడో లెక్క పెట్టలేకపోయాను. అసలు ఇట్లాంటి యాస వరంగల్ జిల్లాలో ఎక్కడ, ఎవరు మాట్లాడతారో చెబితే దర్శక నిర్మాతలకు పాదాభివందనం చేసుకుంటాను.
తెలంగాణ యాసలను న్యూనపరిచే, అవహేళన చేసే, కింఛపరిచే ఇలాంటి సన్నివేశాలను అనేక సినిమాలలో గత 55 సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం?
ఇప్పటి వరకూ తెలంగాణను ప్రతీకాత్మకంగా ఎట్లా అవమానించాడో చూసాం. ఇది ఒక ఎత్తయితే ఒక పాటలో తెలంగాణా ఉద్యమాన్నీ, తెలంగాణా వాదుల్నీ, తెలంగాణా ఉద్యమకారుల్నీ చులకన చేయటం మరో ఎత్తు! ‘ప్రేమే పోయినాదిలే’ పాటలో పూర్తిగా దిగజారుతాడు దర్శకుడు, పాట రచయిత.
‘… అల్లుడే రెడీ అంటే తెలంగాణ తెప్పించేస్తా…’ అంటాడు రాజన్న. అదేదో ఆ అల్లుడుగారి, ఈ మామగారి ప్రైవేటు వ్యవహారమన్నట్టు! ఈ లైన్ తర్వాత ఒక్కసారి స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంది. అందరూ ఆముదం తాగిన మొహాలు పెడతారు. తర్వాత రాజన్న బామ్మర్ది ‘ మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసాడంటా…’ అని అందుకుంటాడు. అంటే తెలంగాణాని కోరుకోకపోవటం ‘మంచిగ ఉండటం’, కోరుకోవటం ‘మెంటల్’ గా అయిపోవటం! సదరు బామ్మర్ది ఇంటలిజెన్స్ డిపార్టుమెంటులో పనిచేయటం యాదృచ్చికమేనా?
దీంతో ఇప్పటివరకూ ఇస్తూ వస్తున్న ‘బెనిఫిట్ అఫ్ డౌట్’కు ఈ సినిమా పూర్తిగా అనర్హమౌతుంది! తెలంగాణ వాడి గుండె మండుతుంది, రక్తం మసలుతుంది. సమైక్యవాదం ఒక ఫార్సు కాకపోతే ఈ పాటికే సున్నితమైన ప్రస్తుత సందర్భంలో ఇలాంటి రెచ్చగొట్టే సినిమా తీసినందుకు సీమాన్ధ్ర ప్రాంత ప్రజలు ఆ దర్శక, నిర్మాతలను నిలదీయాలి, ప్రశ్నించాలి. కాని అది జరగలేదు, జరగదు! ఇప్పటికే ‘అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం’ నించి ‘ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసుందాం’ వరకు వచ్చింది పరిస్థితి.
తెలంగాణ ఏర్పాటు అనివార్యం, తథ్యం! అయితే తెలుగువారి మధ్య ఈ విభజన భౌగోళికమే కాని మానసికం కారాదన్నా, పరస్పర అభిమానం, గౌరవం కొనసాగాలన్నా ‘కందిరీగ’ లాంటి సినిమాలను సీమాంధ్ర ప్రజలు తిరస్కరించాలి. ‘కందిరీగ’ రూపంలోని ఈ విషనాగు సీమాంధ్రలోని కోంతమంది స్వార్థపరుల, పెట్టుబడివర్గాల, ఆభిజాత్యం, ఆధిపత్యం, అహంకారం, ప్రాంతీయతత్త్వాలకు పుట్టిన విష పుత్రిక. వీటిని సమూలంగా నాశనం చేస్తేనే తెలుగువారి మధ్య భావ ఐక్యత సాధ్యం!
చేయీ చేయీ కలపటానికి తెలంగాణా ఎప్పుడూ సగానికంటే ఎక్కువ దూరం నడవటానికి సిద్ధమే!
- మాధవ్
Welcome to my blog ‘’Parimalam-పరిమళం’’. Although I have started this blog long time back but I never had put my pen in this. Recently, I thought to put my ideas in words. I would like to name my blog as Parimalam. Now onwards this will be continued on this name and most of the write-ups by my ''Deepam-దీపం'' (my pen name). Some write-ups may be written by other names as well. Well you may be wondering what parimalam is? Parimalam means fragrance, an expression of personality.
Wednesday, August 24, 2011
విష నాగు… మరో విష నాగు…కందిరీగ
Labels:
haaram,
jalleda,
koodali,
telangana,
telangana blogs,
telugu,
telugu movies,
telugublogs,
tollywood
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Andhra Naa kudukulu....Rojulu Dagara padyi raa meeku
తెలంగాణా వాళ్ళు ఈ సినిమాని బాయ్‌కాట్ చేస్తే పోతుంది కదా? నిరసన తెలిపినట్లు ఉంటుంది. చెత్త సినిమా చూసే బాదా తప్పుతుంది.
Post a Comment