ఆహా హా వచ్చారండి వచ్చారు తెలుగు జాతి పరిరక్షకులు వచ్చారు.
ఆత్మ గౌరవ నినాదం తో మళ్ళీ మన ముందుకు వచ్చారు.
పాలామూరు లో పంటలు లేక ప్రజలు లక్షల్లో వలస వెళ్ళి
కూలిన భవన శిథిలాల కింద బ్రతుకు ఛిద్రమై కుంగిపోయినపుడు ఏమైంది ఆత్మ గౌరవం?
రాజోళిబండ తూమును రాయలసీమ రెడ్లు పేల్చి వేసి కర్నూలుకి నీరు మరల్చినప్పటి కన్నా రాయల వారి విగ్రహ కూల్చివేత ఎక్కువగా బాధిస్తున్నదా?
తలా తునా గోదారి పారుతోన్నా బ్రతుకే యెడారై
విష జ్వరాలకు వినమ్రంగా ప్రాణార్పన చేస్తున్న అదిలబాదు అడవి బిడ్డలను చుసినపుడైనా
గుర్తుకు రాలేదా ఆత్మ గౌరవం?
నల్లగొండ నడ్డి విరిచి, నీరు మరల్చి, మాయదారి ఫ్లోరైడ్ కి మా బతుకుల్ని బలి ఇచ్చి
విరిగిన మా అన్నదమ్ముల ఎముకలతో వెలిగించిన మీ సంక్రాంతి భోగి మంటలో నైనా కనపడలేదా ఆత్మ గౌరవం?
కాకతీయ కళాప్రభల విస్మరించి "తెలుగు" పాఠ్య పుస్తకాలలో ఎక్కడా రాణి రుద్రమ ప్రస్తావనే రాకుండ చరిత్రను కాల రాసి నేడు జాతి జాతి అని వాపోతున్నారా?
తెలుగు సాహితీ పరిమళాలు విరాజిల్లిన విజయవాడ సాక్షిగ కళాశాలల్లో ప్రతి కులానికి ప్రత్యేకంగా స్వాగత కార్యక్రమాలు జరిపినపుడు ఎమైంది ఆత్మ గౌరవం?
కాళోజి ని కాల రాసి, దాశరథి ని దాచివేసి, కొమురాన్ని, ఐలమ్మ ను తెలుగు చరిత్రలోంచే కడిగేసి
భళ్ళారి రాఘవ సాక్షిగా మా భాష ను యాస ను కించపరచి, తెలంగాణ వారిని చిల్లర మల్లర రౌడీలుగా చిత్రీకరించినప్పటికన్నా నిన్నటి సంఘటన ఎక్కువగా బాధిస్తున్నదా?
"సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవోయి" అన్న గురజాడ వారి ఆదర్శాలను అధహ్ పాతాళానికి తోసి, ఒక రాతి విగ్రహం పై రాధ్ధాంతమ?
సిగ్గు సిగ్గు
ఉస్మానియా లో మీ సాటి అక్క చెల్లెళ్ళను రక్షక భటులే రాక్షస భటులై చెప్పరాని చోట లాఠీలతో దెప్పి పొడుస్తూ హింసించినపుడు ఏమైంది ఆత్మ గౌరవం?
ఆ నాడు కాదా తెలుగు జాతికి చీకటి రోజు?
ఆవేదన తో ఆక్రోషం తో ఆరు వందల ప్రాణాలు ఆత్మార్పణ చేసుకున్న ఇవి కావా చీకటి రోజులు?
No comments:
Post a Comment