Monday, March 14, 2011

చెక్కు చెదరని మీ చెప్పులేసిన చరిత్ర!

నాడు 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్నాడొక మహానుభావుడు. కాని నేడు 'రాష్ట్రమంటే రాతిబొమ్మలేనోయ్ రాలిపోయే ప్రాణులు కాదోయ్!' అని అంటున్నారు
వన్నెతగ్గని కుహనా ప్రజాస్వామిక, సాంస్కృతిక-సాహిత్య దురంధరులు. కూలిన విగ్రహాల గురించి నిరసనలు, నివాళులు, లెంపలేసుకోవడం మరియు పాలాభిషేకాలు చేసి కన్నీరు పెట్టుకోవడం కడు శోచనీయం. వారి దూషణలు మిక్కిలి గర్హనీయం. ఐదున్నర దశాబ్దాల దోపిడి, ఆరాచక మరియు నియంతృత్వపు వలసవాద పాలన నుండి విముక్తికై పోరాడుతూ,
తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి మంటల్లో కాలి బూడిదవుతున్న ఆ త్యాగ మూర్తుల కంటే తమది కాని అన్య మూర్తుల ప్రాముఖ్యత సమయానికందిరాని ఆలోచన. పాలకుల తుపాకుల నుండి వర్షించే తూటాలు, ఇనుప బూట్ల తొక్కుల్లు మరియు లాఠీల విలయతాండవంతో నెత్తురోడి నేల రాలిన ఆ భావి కుసుమాల గురించి ఒక్క కన్నీటి చుక్క రాల్చి సానుభూతి తెలిపే, మానవత్వం మూర్తిభవించిన సాటి తెలుగువారలె లేకపోయిరి కదా! అణచివేతలతో, ఆధిపత్యపు ఆగడాలతో దెబ్బ తిన్న జీవుల కళ్ళలోంచి నీళ్ళకు బదులు
నిప్పులు, హృదయంలోంచి ప్రేమకు బదులు ద్వేషం పుడుతుందనే నగ్న సత్యం విజ్ఞులకు తెలియంది కాదు. దాని పర్యావసనమే ట్యాంక్ బండ్ ఘటనలు. ఇది గ్రహించక పుండు మీద కారం జల్లినట్లు ' అమానవీయమని, తెలుగు వారు తలదించు కోవాలని, దున్న పోతులూ సిగ్గు పడతాయని, చరిత్ర క్షమించదని, దోషులను ఉరి తీయాలని ఎన్నెన్నో సూక్తులు వినిపించారు కుహనా సంగీత-సాహిత్య-సాంస్కృతిక సామ్రాట్లు . మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యా ప్తంగా చాటి చెప్పి అందుకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు కీ.శే. నందమూరి తారక రామారావు మీద చెప్పులు విసిరి అవమానం చేసిన నాడు ఈ తెలుగు జాతి ఎక్కడ విశ్రాంతి తీసుకుందో ? ఆ దోషులను శిక్షించక పోగా నిసిగ్గుగా ఓట్లు వేసి రాజ్యాధికారాన్ని అప్పగించిన ఘనత మీకే చెల్లింది కాబోలు. చివరకు ఏ ఆదరణకు నోచుకోక కృశించి దిక్కు లేని చావు చచ్చిన మాట వాస్తవం కాదా? ఇక మరో తెలుగు ముద్దు బిడ్డ కీ.శే. పి.వి. నరసింహారావు గారి మీద కర్నూల్ లో చెప్పులు విసిరి తమ తెలుగు సంస్కృతీ అభిమానాన్ని దశ దిశల చాటిన ఆ ఘనత మీకే సొంతం. అట్టి కార్యక్రమ వ్యూహ కర్తలకు శాపనార్థాలు, శిక్షలు ఉండకపోగా మంత్రులు-ముఖ్య మంత్రులను చేసి ఆనందపడిన చరిత్ర మీకు మాత్రమే వున్నది. ఇంతగా గొంతు చించుకుని, గుండెలు బాదుకునేవారు ఈ మధ్య బరంపురంలో జరిగిన తెలుగు మహాసభలో తెలంగాణ కవి నందిని సిద్దా రెడ్డి మీద భౌతిక దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదు? ప్రసార సాధనాలు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు?. అతను సిమాంధ్ర రాతిబొమ్మ పాటి విలువ చేయరు కాబోలు. ఇగ త్రివర్ణ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య చరిత్ర తిరగవేస్తే మరీ దుర్భరం. ఆ దేశబక్తుడి ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయి ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా కడు పేదరికంతో కనుమూశాడు. అప్పుడు ఏలిన వారికిగాని, అనా మకులను, అవినీతిపరులను ఆదుకుని సత్కరిం చే తెలుగు సంస్థలు గాని, సంఘాన్ని ఉద్దరించే ఆపన్న హస్తా లు ఎక్కడికి అదృశ్యం ఆయ్యాయో తెలియదు. మరో దారుణం ఏమిటంటే పింగళి వెంకయ్య కుమారుడు పింగళి దశరథరాం ఎందుకు చంపబడ్డాడు? ఎవరు చంపారు? దోషులు ఎలా మాయమయ్యిండ్రు? దీనిపైన ఈ తెలుగు జాతి గళం విప్పలేదెందుకు? ధర్నాలు, పోరాటాలు చెయ్యలేదేందుకు?
పాది రికుప్పం, కారంచేడు మరియు చుండూరు హత్యలు గుర్రం జాషువా గౌరవార్థం జరిగి నవేనా? ఈ కుహనా ప్రజాస్వామిక వాదులు, సాహితీ వేత్తలు తమ నిసిగ్గు ద్వంద ప్రమాణాలు ఇక నైనా మానడం
మం చిది. అంతెందుకు ఈ మధ్య రోశయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే సీమాంధ్రలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎన్ని ద్వంశం అయ్యయో చెప్పక్కర్లే దు మరి పెకిలిన గొంతులెన్ని? ఖండించిన ప్రజాసంఘాలేన్ని? ప్రశ్నించిన మానవతావాదులేరి?.ఆగడం చేస్తే జగడం ఆగదు సరికదా ఇంకా ఉదృతం అవుతుంది. పది సంవత్సరాల పసి బాలుడి నుండి పండు ముదుసలికి తప్పని బైన్దోవర్లు, కాలికి చెప్పులు లేకుండా రచ్చబండకు రమ్మనడం లేదంటే ఊర్ల దిగ్బంధనం, ఇండ్లు,బండ్లు,గొడ్డు గోదను తగులబెట్టడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సోదరభావం? చావడానికి యావత్ తెలంగాణ సిద్దం అయ్యింది గాని భాష పేరుతో
బానిసత్వానికి, కులంపేరుతో కుటిల రాజకీయానికి
ఏ మాత్రం సహకరించడానికి సంసిద్దులుగాలేరనే నగ్న సత్యాన్ని వలస
పాలకులు గుర్తుంచుకోవాలి. లేదంటే ప్రజల కోపాగ్నికి
ఆహుతి గాక తప్పదు.నియంతల చరిత్రనుండి నిజాలు తెలుసుకుని
హుందాగా నిష్క్రమించడం ఉత్తముల లక్షణం.

"భక్తుడి కోపానికి భగవంతుడికే భంగపాటు తప్పలేదన్న సత్యం జగత్వ్యాపితం".

జై తెలంగాణా - జై భోలో తెలంగాణా!

అనీల్ మద్దిరాల సహాయంతో మీ,
దీపం,

5 comments:

Saahitya Abhimaani said...

"...పింగళి వెంకయ్య కుమారుడు పింగళి దశరథరాం>>>"

పింగళి దశరథ్ రాం వంకయ్యగారి కుమారుడు కాదు మనుమడు.

దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో 1985వ సంవత్సరం అక్టోబరు 21వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, సత్యనారాయణపురం(విజయవాడ) లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త పింగళి వెంకయ్య చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారు.

balasubrahmanyam.b said...

చుండూరు సంఘటనని దీనితో పోల్చకండి అది వళ్ళు బలిసి కామంతో ఆడపిల్లలని వేధిస్తే పోలీసు ద్వారా కూడా న్యాయం జరగక పోతే రగిలిన ప్రతీకారేఛ్ఛలో భస్మం అయ్యారు

KD said...

సారీ శివ గారు... పూర్తి డిటైల్స్ తో కరెక్ట్ చేసినందుకు మనస్పూర్తి ధన్యవాదాలు...
సారీ బాల గారికి kuda...

voleti said...

తెలంగాణ ప్రాంతం ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర లో కూడా వుంది.. దాని కోసం కూడా పోరాడండి ఒకప్పుడు నైజాం నవాబు భూమి దాని మీద మీ కెంత హక్కు వుందో న్యాయబద్దంగా సంపాదించుకున్న వాళ్ళందరికీ హక్కు వుంటుంది...నీళ్ళు పల్లం లోకి పారకుండా మోటార్లు పెట్టి మీ మెరక వైపు పారించండి (కోట్లు మీ కె సీ ఆర్ ఇస్తాడు) ఇహ వుద్యోగాలు గావాలె గావాలె అని అరుస్తె రావు.. గీ తెలబాన్ వుద్యమాలు మాని సక్కగ సదువుకోవాలె.. నా కామెంట్ నువ్వు ప్రచురించవు గాని రాస్తున్నా

KD said...

చూడు మిత్రమా వోలేటి,
కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిసిన వాళ్ళు ఎవరు అడగడం లేదంటే దాని అర్ధం- వాళ్లకు ఆయా రాష్ట్రాల్లో న్యాయం జరుగుతుందని.. అక్కడ ఉంటున్న ప్రజలు ఎపుడు కూడా వివక్షతకు గురి కాలేదు అని... ఇక్కడ ఎవడు కూడా నవాబు బూమి మీద హక్కుల గురించి మాట్లాడటంలేదు..... సందర్భాన్ని బట్టి ఉంటుంది... నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అర్ధం కావట్లేదు కాని, నీరు ఎత్తు నుండి పల్లానికి పారుతుందని కూడా తెలీని నీ చదువు కి సలాం... ప్రభుత్వమే తలుచుకుంటే ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టలేదా....???.
ఇకఉద్యోగాలు అంటావా..
ఉద్యోగాలు చదువుకుంటేనే వస్తాయి అనుకుంటే, అది నీ భ్రమ... ఎక్కడిదో, ఎన్నాటిదో ఎందుకు నీకు ఈ మధ్యే జరిగిన సంఘటన చెప్తాను విను... మొన్న జరిగిన అంటే గ్రూప్-1 2008 పరీక్షల రిజల్ట్ నీకు తెలీదేమో.. తెలిస్తే ఇలా మాట్లాడవు... వ్రాత పరీక్షల్లో టాప్ లో ఉన్నారు మావాళ్ళు కాని ఇంటర్వ్యూ లో ఏమైందో తెల్సా...?? రాత పరీక్షల్లో 30 , 40 కి పైగా ఎక్కువ మార్కులు ఉన్న తెలంగాణా వారికి ఇంటర్వ్యూ ఐపోయేసరికి, మొత్తం మార్కుల్లో మిగతా వారికంటే 20 మార్కులు తక్కువగా ఉన్నాయి.. అంటే ఒక్క ఇంటర్వ్యూ లోనే సీమంధ్ర వారికి తెలంగాణా వారికంటే 50 కి పైగా మార్కులు వచాయి... ఒక్కొకరికి 80 కి పైగా ఎక్కువ మార్కులు వచాయి సారీ వేసారు... అంతటి మేథావులు అన్నమాట మీ వాళ్ళు... ఇక వీళ్ళ గురించి తెలుసుకుంటే,. అలా ఎక్కువ మార్కులు వచ్చిన వారంతా ఒకే ప్రాంతానికి, ఒకే సామాజిక వర్గం ముఖ్యంగా APPSC చైర్మన్ సామాజిక వర్గానికి చెందిన వారు.... ఇదంతా తెలీకుండా మాట్లాడుతున్నావ్.. ముందు చరిత్ర తెలుస్కో, ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్నదేంటో తెల్సుకో అపుడు మాట్లాడు.... చదివిన కూడా ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి ఇక్కడ ఉంది.. ఇక తాలిబాన్ అంటూ ఏదో పిచికూతలు కూస్తున్నావ్... జాగ్రత్త...
ఇక ఈ కామెంట్ ప్రచురించను అని అంటున్నావ్... నేను నువ్వు అనుకుంటున్నట్లు కాదు... ప్రతి కామెంట్ ని ప్రచురిస్తా... డునాట్ వర్రీ అబౌట్ యువర్ కామెంట్...
నేను రిప్లై ఇచే టైం లోనే ఏ కామెంట్ ని అయినా ప్రచురిస్త, అంతవరదాక హోల్డ్ లో ఉంచుతా, అంతే కాని డిలీట్ చేయను... ఇదంతా చూస్తుంటే నీ అజ్ఞానం తెల్సుస్తోంది...