ఆయన ఎన్నోసార్లు వారించినా ఆయనను అందరూ తెలంగాణ సిద్ధాంతకర్తగానే గుర్తించారు. కొందరు కొంత చిన్నచూపుతో తెరాస సిద్ధాంతకర్తగానో, సలహాదారుగానో కూడ గుర్తించి ఉండవచ్చు. కాని ఆయన ఆ విశేషణానికి ఎన్నోరెట్లు మించిన తెలంగాణ ముద్దుబిడ్డ. మరపురాని తెలంగాణ మహావ్యక్తి.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నిజంగా ఒక అరుదైన మానవతామూర్తి, ఒక ప్రజ్ఞావంతుడైన విద్యావేత్త, ఒక సమర్థుడైన విద్యా నిర్వాహకుడు, ఒక శక్తిమంతుడైన ప్రజామేధావి, ఒక అసాధారణమైన ఆలోచనాపరుడు-ఆచరణశీలి కలగలిసిన మహావ్యక్తి. మహాశక్తి. డెబ్బై ఆరు సంవత్సరాల జీవితంలో ఆరు దశాబ్దాల పాటు ఆయన తెలంగాణ స్వతంత్ర వ్యక్తిత్వం గురించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించీ పనిచేశారు గనుక తెలంగాణ సిద్ధాంతకర్త అనే పిలుపు ఆయనకు అక్షరాలా సరిపోతుంది.
ఉన్నత పాఠశాల విద్యార్థిగా 1952 ముల్కీ ఆందోళనలో పాల్గొన్ననాటినుంచి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధో పునాది అందించిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ బాధ్యుడిగా ఉన్ననాటినుంచి, ప్రస్తుత తెలంగాణ ఉద్యమం దాకా అరవై సంవత్సరాల పాటు ఆయన తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపడానికి నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చారు. 1950ల తొలిదినాలనుంచి 2011 దాకా ఆయన తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు గురించి కలగంటూనే ఉన్నారు, పరితపిస్తూనే ఉన్నారు. ఆ కృషిలో ఎవరి కలిసి వస్తే వారితో కలిసి పనిచేస్తున్నారు. ఆ అర్థంలో ఆయనను తెరాస సిద్ధాంతకర్త అన్నా, తెలంగాణ సిద్ధాంతకర్త అన్నా అతిశయోక్తి కాదు. నిజానికి అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణ కోసం పనిచేస్తున్న రాజకీయ, రాజకీయేతర సంస్థలకూ వ్యక్తులకూ అందరికీ ఆయనే ప్రేరణ. లోలోపలనైనా ఆయన ఆరాధ్యుడు. కాళోజీ తర్వాత ఆ స్థానం దక్కేది జయశంకర్ కు మాత్రమే. కాళోజీకైనా తొలిరోజులలో విశాలాంధ్ర మహాసభ నేపథ్యం ఉన్నది గాని జయశంకర్ ఆదినుంచి తుదివరకూ తెలంగాణను మాత్రమే కోరుకున్నారు.
తెలంగాణ వ్యక్తిత్వం మాత్రమేకాక జయశంకర్ లో విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగా ఆయన స్నేహశీలి. వయోభేదం లేని స్నేహం ఆయనది. మనుషులపట్ల, తోటి మనుషుల ఇబ్బందుల పట్ల ఉద్వేగపూరితంగా స్పందించేవారాయన. ఎవరితోనైనా మృదువుగా, సాదరంగా, ప్రేమతో ప్రవర్తించేవారు. విద్యావేత్తగా ఆయన ప్రజ్ఞావంతుడు. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, లోతైన విశ్లేషకుడిగా ఆయన కృషి మరవరానిది. ఆయన రచనల్లో, ఉపన్యాసాల్లో అది నిక్షిప్తమై ఉంది. ఆయన నిర్వహణ సామర్థ్యానికి అద్దంపట్టే పదవులూ ఎన్నో ఉన్నాయి. అధ్యాపకుల సంఘ బాధ్యుడిగా, వరంగల్ చందాకాంతయ్య స్మారక కళాశాల ప్రిన్సిపాల్ గా, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్ గా, కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా, వైస్ చాన్సలర్ గా ఆయన నిర్వహించిన బాధ్యతలు, ఆ కాలాలు గర్వంగా గుర్తుంచుకోదగ్గవి.
హనుమకొండలో గడిచిన చిన్నతనంలో ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్ని కళ్లారా చూశారు. బహుశా దుష్పరిపాలనకు వ్యతిరేకించే ప్రజల పోరాటశక్తి మీద అపారమైన విశ్వాసం ఆయన మనసు మీద చెరగని ముద్ర వేసి ఉంటుంది. అందుకే ఆయన జీవితమంతా పరాయిపాలకుల దుష్పరిపాలన మీద పోరాటానికి సిద్ధపడ్డారు. 1952 విద్యార్థి ఆందోళనలో భాగం పంచుకోవడం మాత్రమే కాదు, ఫజల్ అలీ కమిషన్ ను కలిసి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విజ్ఞప్తి పత్రం ఇచ్చిన విద్యార్థి బృందంలో ఉన్నారు. అలా 1950ల తొలినాళ్లలో పడిన నిప్పురవ్వ అరవై సంవత్సరాల పాటు ఆరకుండా జ్వలిస్తూనే ఉండింది. అర్థశాస్త్ర అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన తెలంగాణ వివక్ష మీద ప్రత్యేకంగానూ, ప్రాంతీయ అసమానతల మీద మొత్తంగానూ విశేష అధ్యయనం చేశారు. ఎన్నో రచనలూ ఆలోచనలూ చేశారు. అవన్నీ తెలంగాణ సమాజంతో ఎప్పటికప్పుడు పంచుకున్నారు. వందలాది సమావేశాలలో, సభలలో పాల్గొన్నారు. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ వివక్ష పై ఏర్పాటు చేసిన అసాధారణమైన సదస్సు నిర్వాహకులలో ఆయన ఒకరు.
1969 ఉద్యమం ద్రోహానికి బలి అయి ముగిసిపోయి, వెనుకంజ వేసిన తర్వాత ఆయన చాల నిశ్శబ్దంగా ఆ అపజయానికి కారణాలను, పునర్విజృంభణ అవకాశాలను అన్వేషిస్తూ ఉండిపోయారు. ఆ నిశ్శబ్ద కృషి 1990ల నాటికి ఫలితాలు సాధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక మార్గాంతరం లేదు అనే ఆలోచనకు 1990లనాటికి బహుజనామోదం లభించింది. 1990ల మధ్య నుంచీ అనేక సంస్థలు పుట్టుకువచ్చి ఈ ఆకాంక్షను వ్యక్తీకరించడం ప్రారంభించాయి. ఆ సంస్థలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాటిమీద జయశంకర్ ప్రభావం నిరాకరించడానికి వీలులేనిది.
1971 తెలంగాణ ప్రజాసమితి ద్రోహం తర్వాత మొదటి రాజకీయ నిర్మాణంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం కూడ ఆయన కృషికి కొనసాగింపే. ఈ పరిణామాలతో తన కల సాకారం కాబోతున్నదని ఆయన సంతృప్తి చెందినట్టు కనిపిస్తుంది. అయితే అప్పటికీ కొన్ని నిరుత్సాహాలు, ఆశాభంగాలు లేకపోలేదు. ఆయన వాటిని సన్నిహిత మిత్రుల దగ్గరా, అభిమానుల దగ్గరా వ్యక్తం చేసేవారు కూడ. కాని ఎన్ని లోపాలు ఉన్నా తెలంగాణను సాధించడానికి, ఒక రాజకీయ పార్టీ వెంట ఉండి కృషి చేయక తప్పదు అని ఆయన తనకు తాను నచ్చజెప్పుకునే వారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు మూడు ప్రధాన ఆధారాలున్నాయని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. 1. రాజ్యాంగ అధికరణం (3) కింద పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రాజకీయ ప్రక్రియ. 2. ఆ రాజకీయ ప్రక్రియను సక్రమంగా నడిపే, ప్రజల మద్దతును కూడగట్టే ప్రజా ఉద్యమం. 3. తెలంగాణ ప్రజలలో ప్రతిఒక్కరిలోనూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నింపే భావజాల వ్యాప్తి, మేధో కృషి.
జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధోకృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తినప్పుడు వాటిలో పాల్గొన్నారు. గత పది సంవత్సరాలలో రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అంటే ఆయన తాను చెప్పినమాటకు అక్షరాలా, మనసా వాచా కర్మణా కట్టుబడ్డారు. ఆ కృషి కొనసాగించడమే ఆయనకు నివాళి.
No comments:
Post a Comment