Tuesday, January 25, 2011

తెలంగాణా డిస్కవరీ చానెల్: న్యూ స్టొరీ 'జై బోలో తెలంగాణా'!

తెలంగాణా ముద్దు బిడ్డ , సినిమా ఫీల్డ్ లో జై తెలంగాణా అనే అన్న శంకరన్న గుండె పగిలింది, ఒక్క సారిగా ఉలిక్కి పడిండు, తల్లడిల్లిండు, కంట తడి పెట్టిండు, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ముహూర్తం రానే వచ్చింది , సినిమా కి సెన్సార్ బోర్డ్ అనుమతి లభించలేదని ఒక వార్త దావానలం లా వ్యాపించింది, ఇంక టీవిలో మన వాళ్ళు ప్రత్యక్ష మయి తెలంగాణాకి జరుగుతున్న అన్యాయాన్ని తవ్వి తవ్వి , సోదించి, సాధించి నిజాలు వెల్లడిస్తారు. అసలు సినిమాలకి ఒక సెన్సార్ బోర్డ్ ఉంటుందని మనకు ఇపుడే తెలుస్తుంది, అదికూడా మన సినిమాకి అందులో ఏమి అశ్లీలత లేని సినిమాకి సెన్సార్ ఎందుకుంటుంది అని, సెన్సార్ అంటే కేవలం అశ్లీల దృశ్యాలను మాత్రమె ఖండిచవలెను అని ఇప్పటికి వరకు మనకు తెలిసిన నిజం , ఇపుడు అది కాదు అని మన సీమ ఆంధ్ర వాదులు, వారి సబ్యులు నిరూపించారు, లేకపోతె, రాత్రి కి రాత్రి కొన్ని చట్టాలను రూపొందించి 'ఉద్యమాలు' అందునా 'ఈ' సమయంలో 'ఇలాంటి' సినిమాలు చూపించ వద్దని ఆధారాలు శ్రుష్టించును , ఎంత విచిత్రం, ఇది కూడ సెన్సారు అనబడుడును, అన్న శంకరన్న! ఎం సినిమాలు తిస్తావే? నీకు ఇన్నెండ్లుగా ఒక చిన్న నిజం తెలవలేద? తెలంగాణా వాళ్ళు సినిమా తీసేంత ఎత్తుకు ఎదగడమే ఒక సెన్సార్ అని తెల్వద, మనం ఎపుడు జోకర్ల లాగానో, మన భాష ఓల్డ్ సిటీ , అదికూడా హైదరాబాద్ ల ఉన్న రౌడీలు మాత్రమె వాడే భాషగానో, మన పల్లె పాట అంటే ఐటెం సాంగ్ గానో ఉండాలే కాదె! మన సినిమాలు, మన కథలు, మన జాగాలు, వాళ్ళ చేతిలో ఉండాలే, కనపడాలే గాని, నీకు ఎంత ధైర్యం సొంతం గా, తెలంగాణా థీమ్ మీద సినిమా తీస్తవ? వాళ్ళ సినిమాలు నడప దానికే మన సినిమా హాళ్ళు, మనం ఎపుడు మన పరిస్తితి ఇలా కూడా ఉంటుందని ఊహించలేదు, అసలు మనం ఎపుడు ప్రశ్నించడం నేర్చుకోలేదు, ఇపుడు కాళ్ళ కిందికి కష్టం వచ్చింది ఒక 'కొత్త' 'నిజం' డిస్కవరీ లోకి వచ్చింది. మనల్ని ఇలా కూడా హింసిస్తారు అని ఇపుడే తెలుస్తుంది, అది ట్రాజెడీ, ఈ ట్రాజెడీ మీద మరొక సినిమా తీయ వచ్చు, ఇది చూసినంక ఇంక ఎవరికైనా ఉత్సాహం ఉంటె చూద్దాం, అది వేరే సంగతి.

తెలంగాణాల అసలు ట్రాజెడీ ఏందీ అంటే, మన దాక వచ్చిందాకా మనకు ఏది అర్థం కాదు. రక్తం తాగే జంతువు మనకల్లముందు కనపడుతుంటే, జలగల్లా మనల్ని పట్టి పీడిస్తుంటే దాని నుండి మనం తప్పించు కోవాలని ఎపుడు ప్రయత్నించాము? పాపం, ఏదో ఒక రోజు తన తప్పు తాను తెలుసుకొని మారును, అప్పటివరకు మనం శాంతి, శాంతి , శాంతి ! అంటూ జపిస్తూ ఉండవలెను. ఇది మనం అనుసరించే విధానం, శత్రువు కి తెలుసు మనం ఏమి చేయలేమని, అపుడెపుడో ఉద్యోగాలు పోతున్నాయని మా అన్నలు ప్రాణాలు అన్ని పోగుట్టుకున్నారు, రాజకీయ నాయకులు అమ్ముకున్నారు, ఇదే మేధావులు అపుడు కూడ ఆ రాజకీయ పార్టీని నమ్మిన్రు. శాంతి మంత్రం జపించినారు. పోయిన పానల మీద , తెలంగాణా తల్లి కంట కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే శాంతి , శాంతి , శాంతి అన్నారు. ఇపుడు కూడ, రచ్చబండ కార్య క్రమం , రాచాపున్డులాగా ఉన్న తెలంగాణాల కారం జల్లినట్లుంటే , అన్నలు తమ్ముళ్ళు, ఆవేశం పట్టలేక ఒత్తి టమాటాలు, కోడిగుడ్లు, నీ కాల్మొక్త , నిజంగా ఒత్తి తమాతలే, కోడిగుద్లె, చెప్పులు, చీపుర్లె.. విసురుతుంటే అవేవో బాంబులు అనుకోని శాంతి శాంతి అంటున్నాం! ప్రశాంతంగా గులాబిలతో నిరసన తెలియ చేయండి, మీ మండే కడుపులకి మరింత ఆకలి నింపుతూ నిరాహార దీక్షలు చేయండి..కాని వారి వ్యాపారాలు దెబ్బ తినకూడదు సుమా! వారి రవాణ సౌకర్యమునకు అంతరాయము కలుగరాదు, వారు బాదపడుదురు. ఇంకా పదేండ్లు అయినా పరవాలేదు అని పెద్ద సారూ అంటుంటే, నోట మాట ఒస్తలేదు ఎంత పెద్ద మనసు ఆయనది! మీరు సస్తనే ఉన్డున్డ్రి రా భై, ఈ గులాబి పూలు ఆఖరికి మీశావాలపై అయిన ఉండొచ్చు కాని మీరు మాత్రం ఆవేశ పడొద్దు, శాంతి , శాంతి ! మేము రాజకీయాలు చేస్తుంటాం, మీరు ఉద్యమాలు చేయున్రి, అదే వాడు, నా గడ్డ మీద, బతకనికి చిప్ప చెంబు పట్టుకొని, వచ్చి ఇక్కడ దుకాణాలు పెట్టుకొని, మా అవకాశాలని మాకు రాకుండా చేసి మమ్మల్ని బిచ్చగాళ్ళుగా చేసినా కూడా మాకు ఏమి అర్థం కాదు, ఇంకా మీరు మంచి అనే అనుకుంటున్నాం, మా నాయకుల ప్రకారం అనుకోవాలి కూడ. నా తమ్ముడు వేణు, శ్రీకాంత, యాదయ్య కళ్ళ ముందే కాలి మసి బొగ్గు అయితారు తెలంగాణా కోసం , వీళ్ళకి రాజకీయాలు తెలవదు, రేపు తెలంగాణా వస్తే వాడికేమైతదో తెలవదు కాని ఇప్పటి బాద ఏంటిదో తెలుసు, మా తుచ్చ రాజకీయాలు, నాయకులు వాళ్ళ చాత గాని తనం చూసి ఏమి చేయలేక , శాంతి మంత్రాలు వినలేక, జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక తమకు తామే సిక్షిన్చుకున్నార అనిపిస్తుంది.

మన డిస్కవరీ చానెల్ లో రోజుకొక అన్యాయం బయట పడుతుంది, ఒక దగ్గర లాయర్స్ అన్యాయం జరిగింది అని తెలుసుకున్నారు, మరొక చోట టీచర్లు , ఇంకోచోట డాక్టర్లు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ,విసిలు, తవ్వుతూ ఉంటె అన్యాయం లేని చోటు, జాగా లేదు, మనం కళ్ళు తెరవడం లో చాల లేటు, ఇవాళ ఉద్యమం పుణ్యమఅని అన్ని వెలుగులోకి వస్తున్నాయ్, అయినా కడుపు మండుతుందా అయితే తప్పు, వెంటనే శాంతి మంత్రం జపించు, తెలంగాణా దానికంతట అదే వచ్చును.

ఇవాళ ఉద్యమం నడుస్తుంది అంటే దానికి పెద్ద రాజకీయ చతురత ఏమి లేదు, నాయకత్వ ప్రతిభ లేదు, ఇది ఇక్కడి గ్రామాల్లో ఉన్న ఆవేశం, పోలీసులకి, లాఠీలకు, కేసులకి భయపడని ధైర్యం, ఇదే ధైర్యం మనల్ని గెలిపిస్తుంది, ఇది నమ్మకం, ఇది సత్యం..నిన్న మనం ఆంధ్ర సినిమాలు ఆపి ఉంటె ఇవాళ జైబోలో కి ఇంత గతి పట్టేది కాదు, ఒక వైపు సినిమా బంద్ చేయి అనంగానే, మరొకవైపు ఎంతిస్తావ్ అన్న బేరం జరుగుతది, ఒక్క రోజే ఉద్యమం నడుస్తది, ఒకడికి నోట్లు, ఉద్యమానికి తూట్లు. ఇక్కడి నాయకులు బలంగా ఉంటె డిల్లి భయపడదా? వ్యాపారాలు నడవవని ఒక్క పిలుపిస్తే మన సొమ్ము ఏమి పోతది, నో నో బ్రదర్ శాంతి ! నీయబ్బ నాయింట్ల నీకేం పని రా అని రస్తాలు బందు పెడితే మూటా ముల్లె సర్దుకొని పోడా? గవర్నరు మార్పు తెలంగాణని మున్చనికి అని తెలవక పాయె, మేము అంటే గోచి గొంగళి గాళ్ళం, మాకేమి ఎరక లేదు, మీరు పార్లమెంట్ల, అసెంబ్లీ ల కూసుంటారు కాదయ్యా, మీకెందుకు తెలవది? డిల్లి ల చెయ్యల్సినోల్లు, గల్లిల ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాదు, నువ్వు చవట, సన్నాసి, దద్దమ్మ, పనికి రానోడివి, తీరొక్క తిట్లు తిట్టు తిట్టుకుంట కూసుంటే కాంగ్రెస్ ఒళ్ళు ఎందుకు మారతారో, సోనియమ్మా ఎందుకు మారతదో, సీమాంద్ర సెన్సార్ బోర్డ్ ఎందుకు మారతదో ఎవరికన్నా జర అర్థం అయితే చెప్పుండ్రి సారూ.. ఇది ఇంకొక న్యూ డిస్కవరీ , ఏదో ఒక రోజు బయట పడక మానదు. సినిమాల పెద్ద ట్విస్ట్ ఏందంటే ఎప్పుడూ ఒకటే సిన్మా తీస్తే వంద రోజులు ఆడుతది అనుకున్తన్రు, ఎక్కడి వంద రోజులు తమ్మి, పది ఏండ్లు అయిపాయే, ఇంక ఇది గిన్నిస్ బుక్కుల ఎక్కాల్సిందే. హిరో మారడు, విలన్లు మారరు, చూసేతోల్లు మారరు, తీసేతోల్లు మారరు..పిచ్చి పోరగాల్లు మాత్రం ఏమైతుందో తెలవక పానాలు తీసుకుంటారు.

చిదంబరం కంటే జగనన్న పరెషాని ఎక్కువాయె, ఉద్యమం గురించి తీరొక్క తీరల పోగుడుకున్టం కాని ఏమి లాభం , ఇక్కడ నాయకులు భయపడక పాయిరి, అక్కడ నాయకులు భయపడక పాయిరి, ఏమి చేయాలే ? శాంతి మంత్రాలు పని చేయనికి ఇప్పుడు గాంధీ గారు ఎవరు లేరు ,మన వాళ్ళు చరిత్రలు ఎందుకు చదవరో కూడా అర్థం కాదు, గాంధి ఎప్పుడైనా ఎలక్షన్ల నిలబడ్డడా? బ్రిటిష్ వాల్లని గడ గడ లాడిన్చలేదా? అప్పటి కాలం లేదు..అవతల గుంట నక్కలున్నారు, వాల్లని ఎదుర్కొనడానికి శాంతి మంత్రాలు, డిస్కవరీలు నడవవి, ఇంక ఎన్ని సార్లు కళ్ళు తెరుచుకున్టాయో మనకి తెలవదు. జంతువు అనాలంటే కూడా పానం ఒప్పుట లేదు, అవి కేవలం ప్రాణ నష్టం అనిపించినపుడే హాని కలిగిస్తాయి, ఇవేం ప్రాణులు? ప్రాణాలు తీస్తూ ఆనందిస్తాయి..

రచ్చ బండల రోకలి బండలు పట్టుకున్న అక్కల చేతిలోనే ఉద్యమం ఉంది ఇవాళ, కోమటి రెడ్డి కారు మీద కోడిగుడ్లు , చెప్పులు పడేసిన అన్నల మీదనే ఉంది ఉద్యమం, పరీక్షలు బహిష్కరించి , తెలంగాణనే మాకు ఒక అగ్ని పరీక్ష అని ఉద్యమం చేస్తూన్న విద్యార్థుల చేతిలో ఉంది ఉద్యమం, తిట్ల పురాణాలలో, పిరికి పందల మాటలలో కాదు. కనీసం పోతున్న భూములను, గుట్టలను, నీళ్ళను, ఉద్యోగాలను ఆపండి ప్లీస్. ఇంక ఎవరికీ ఓపిక లేదు, ఇప్పటికి ఒక చానెల్, ఒక పేపర్ వొస్తుంది, ఇంక నాలుగు చానల్లు రాక ముందే తెలంగాణా రావాలే.

పెద్ద పెద్దోల్లున్నారు, ఒక్కరన్న అన్ని పార్టీలని కూసో బెట్టి పార్ల మెంటులో బిల్లు పెట్టనికి మీపార్టీ ఎం చేస్తది అని అడగక పాయె, ఏమి చేయక పొతే మిమ్మల్ని కూడా ద్రోహులు చేస్తామని ప్రకటించక పాయె, ఉద్యోగాలు చేసుకొంరి, పరీక్షలు రాసుకోండి, ప్రశాంతంగా దీక్షలో కూసొంరి, బోరు కొడితే అపుడపుడు చావండి. నాయకులని ఏమైనా అన్నావో నీ తల వేయి వక్కలు ఆవు గాక! ఎందుకొచ్చిన లొల్లి , ఎవని పని వాళ్ళు చూసుకొంరి..ఇపుడు కాకపొతే తరువాత, ఆ తరువాత, రోజుకొక అన్యాయం, డిస్కవరీ, చర్చ, రచ్చ రచ్చ! హు విల్ సేవ్ దిస్ కంట్రి మాన్? ఆంటిల్ దెన్ ప్రే ఫర్ తెలంగాణా , డోంట్ వర్రీ, వుయ్ హావ్ మెనీ మెనీ గాడ్స్ , వన్ డే యు విల్ గెట్ ఇట్ , డేడ్ ఆర్ అలైవ్!

లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డిస్కవరీ!
జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి.

No comments: