Tuesday, February 22, 2011

తెలంగాణ ముద్దుబిడ్డ వనం ఝాన్సీకి అశృనివాళి.....

తెలంగాణ ముద్దుబిడ్డ వనం ఝాన్సీకి అశృనివాళి.....
నిజమేనా ఇది!
నమ్మలేకపొతున్నం అక్క..
రోజూ నిన్ను టీవీ లల్ల
తెలంగాణ లొల్లులల్ల చుశేటోల్లం,
నువ్వు మట్లాడ్తాంటే,
తెలంగాణ కోసం కొట్లాడ్తాంటే
ఝాన్సి లక్ష్మి గిట్లనే
ఉండెనేమో అనుకున్నం!

మొగోళ్ళు సయితం
మొహమాటపడ్డ క్షణాల్లో
నీ మాటల్తోనే వాళ్ళకు
మార్గదర్శివయినవ్..
ఎందరో ఆడబిడ్డలకు
సయితం ఆదర్శం నువ్వు,
రాణి రుద్రమను సూడలే
కాని నిన్ను సూశినం అక్క..

పొద్దునలేశినసంది
పొద్దుగుంకేదాక
తెలంగాణ కోసం
ఎన్ని వేదికలెక్కినవో,
ఎన్నెన్నీ చర్చల్ల
నీ గళం విప్పినవో
తెలంగాణ తల్లికి పుట్టిన
ప్రతి బిడ్డకు ఎర్కే అక్క..
మా గుండెచప్పుడు
ఇక నుండి
నీ గొంతుకద్వార
వినలేమన్న నిజం
ఓ విషాదం!

పాలకులు మరణిస్తే
మా కండ్లల్ల యెప్పుడు నీళ్ళు రాలే,
కానీ తోబుట్టువు మరణం
యెప్పటికీ తీరని శోకం!
తెలంగాణ ల ప్రతి గుండె నిన్ను
యాదుంచుకుంటది..
నాలుక్కోట్ల మందిని
ఒకళ్ళుగ చేశిన నువ్వు
ఒక్కదానివయి
యెట్ల ఎల్లిపొయినవ్!
ఈ చేదునిజం
అబద్దమయితే
ఎంతమంచిగుండునోకదా!

వీరులకు మరణం లేదన్నది
వాస్తవం,
నడుస్తున్న చరిత్రలో
వనం ఝాన్సి ఒక భాగం,
తెలంగాణల
ప్రతి వేదిక మీద
నీ మనాది ఉంటది..
నువ్వేశిన తొవ్వలో
ఎందరో తమ్ముళ్లు చెల్లెండ్లు
నడుస్తనే ఉంటరు,
ప్రతి ఆడబిడ్డ
జై తెలంగాణ నినాదాల్లో,
ఎత్తిన పిడికిళ్లలో నువ్వుంటవ్ అక్కా....

ఎవలన్నరు తోడబుట్టిన రక్తసంబంధీకులమధ్యనే ఆప్యాయతానురాగాలుంటయని,
రక్తసంబంధంకన్నా వర్గసంబంధం గొప్పది. వర్గసంబంధంతోపాటు తెలంగాణల పుట్టిన ప్రతివ్యక్తి మధ్యగల ఆత్మీయ బంధం గొప్పది. అందుకే ఆమె మా అక్క.. తెలంగాణ ఝాన్సీ, సార్థక నామధేయురాలు

No comments: