Sunday, February 27, 2011

పల్లె పల్లె పట్టాల పైకి...

నేను జేబుల్లో
కోకిలలు వేసుకు రాలేదు.
పిడికిళ్ళలో బాంబులతో వచ్చాను
నేను మోకరించి ప్రార్థిస్తున్నాను
ఓ జిందగీ నన్ను
సుఖం మీద శిలువ వేయకు -శేషేంద్ర

సుఖం..ఎన్నిరోజులైందో తెలంగాణా ప్రజలు దాని జాడ చూసి, నేను రోజులంటే , నా ఊర్ల ఉన్న అవ్వ వెక్కిరిస్తుంది, పొట్ట కూటికి దేశం పోయిన కొడుకు వస్తాడో రాడో అని ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన , అలసి పొఇన కళ్ళతో గురుతు చేస్తుంది , రోజులు కాదు బిడ్డ యుగాలని. అవును యుగాలు, అన్యాయాన్ని చూసి చూసి, మోసి మోసి కూలబడ్డ కాలాలు. ఇపుడే నిద్ర లేచినట్టుంది తెలంగాణాల పోరాటాలు చూస్తుంటే జనాలకి , ఇయ్యాల రైలు పట్టలేక్కిస్తున్రు , అంటే ఇన్నేండ్లు గాడి తప్పిందా అని ఒక దోస్త్ అడుగుతుండు, ఏమో బై ఇప్పటికైనా సరిగ్గా నడుస్తుందేమో చూద్దాం . ఇన్ని ఏండ్లు చేసినయ్ కూడ పోరాటాలే , మాటలు, పాటలు, రాతలు, కోతలు,కోలాటాలు, కథలు, కత్తులు, ఎత్తులు , జిత్తులు..అన్ని పోరాటాలే..దశలు దశలు గా పోరాటాలు ..

అన్న, తెలంగాణా ఎట్లోస్తదో చెప్పుండ్రి జర! ఒక హౌలే గాడు, వాడు సోనియమ్మకి ‘రాష్ట్రంలో ఏమి జరుగుతలే’ అని రిపోర్ట్ ఇస్తాడు. సహాయ నిరాకరణ అంత కేవలం ఉద్యోగులు మాత్రమె చేస్తున్రని చెప్తాడు. ఎన్ని కోట్లు ముట్టినాయో వానికి జర కనుక్కోండి భై, తెలంగాణా ప్రజలందరూ రక్తం అమ్మైన సరే అంతకన్నా ఎక్కువిస్తామంటున్రు మావోల్లు, ఎవరన్న జర బేరం జేయున్ద్రి , ఈ వెధవలకి డబ్బులు తప్ప ఎం కనపడై..అసలు ఆంధ్ర జ్యోతి అనే చానెల్ ని బహిష్కరించండి రా భై అంటే ఆడనే బోయి ముచ్చట్లు చెప్తారు మావోల్లు..అసలు రాజ్ న్యూస్ లాంటి చానళ్ళు డిస్కషన్లు ఎందుకు పెట్టరు? ఇపుడు బాగానే వస్తున్నాయి కదా పైసలు? పొద్దున్న డిస్కషన్ పెడతాడు, సాయంత్రం విషం కక్కుతాడు ఆ చానల్ వాడు. పేపర్ మనది కాదు, చానెల్ మనది కాదు..పెట్టుబడిలకు పుట్టిన విష పుత్రికలు అని వాళ్ళే చెప్పుకున్నారు. మనాది అంతా ఒక్కటే, బక్క పలచ గుండెలున్నోల్లు, గుండె పలిగి సస్తరే అన్న , అసలే దిక్కు దివాణం లేని జనాలు, పొద్దున్న లేస్తే రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తున్రు, బతుకమ్మలు, బోనాలు, వంటలు , వార్పులు, దిష్టి బొమ్మ దహనాలు, రాలీలు, రాస్తా రోకోలు..ఎన్ని చేసిన అన్తలేవు అనడానికి ఇవే నిదర్శనం. సిఎం లు మనోళ్ళు ఎపుడు ఉండరు, ఉన్న మనోళ్ళు భయం భయంగా చస్తానే ఉంటారు. అమ్మ దీవెనల కోసం , ఉన్న పదవుల కోసం ఇంకా ఇంకా మభ్య పెడ్తనే ఉంటారు.

ఇపుడే అందిన వార్త, అది కూడ అదే చానల్ ల వస్తది, జూపూడి గారి జ్యోతిష్యం, అసెంబ్లీ సెషన్ అయి పోగానే రాష్ట్ర పతి పాలన వస్తదంట. కానియండి రా ! ఎడికైతే ఆడికి కానియండి. తెలంగాణా మీద పడి అడ్డగోలుగా దోచుకొని ఒక్కొక్కడు వోల్లు కొవ్వెక్కి ఉన్నాడు, మా పోరాటాలు ఎవడికి కానోస్తలే. చివరి వరకు లాగితే ఏమైతది..తెలంగాణా బండి ఇప్పటికైనా రైలు పట్టాల పైకి ఎక్కుతుంది..జస్మిను విప్లవాల పరిమళాలు తెలంగాణాల కూడ పరిమలిస్తున్నాయి, ఈజిప్ట్ విప్లవాలు నరాల్లో నిండుతున్నాయి. ఆలస్యమే కావొచ్చు, అంత తేటతెల్లం అయితున్నాయి, రంగులు బయట పడుతున్నాయి, మావోడు ఎవడు రాజకీయాల పనికి రాదనీ తేల్చి చెపుతున్నాయి. గ్రామాల తిరుగుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఒక కాడ కంగ్రేసోడు తెలంగాణా అన్నోడిని జైల్ల పెడతాడు, ఇంకొక కాడ తెలుగు దేసపోడు తన్ని తరిమేస్తాడు, మొన్న కరీం నగర్ల యువజన నాయకుడు తిరుపతిని, టిడిపి వాళ్ళు దుడ్డు కర్రలతో కొడితే తల పగిలింది , తప్ప తాగి బందు రోజు , కర్రలతో విచ్చలవిడిగా తిరుగుతున్రు వాళ్ళు. ఎవడికి కనపడదు , వినపడదు. నిన్నటికి నిన్న మీటింగులో ఇంకొక నిజం బయట పడ్డది, తెలంగాణా నాయకులకు కూడ నిజమైన నాయకులని చూస్తె పడతలేదని, ఈ రాజకీయ నాయకులు మాకొద్దు అని జనం తేల్చి చెప్పెసిన్రు. మోరల్ ఆఫ్ ద స్టోరి ఏందంటే, రాజకీయ నాయకులు తెలంగాణా తెచ్చేది ఏమో కాని రానీకుండా అడ్డు పడుతున్రు..ఇంత పచ్చి నిజం చెపితే అక్కలకి, అన్నలకి కోపం రావొచ్చు..అయితే ఇక్కడ చిన్న కిటుకు ఉంది..టీవి లల్ల మాట్లాడే నాయకులు వేరు, గ్రామాల ఉండే నాయకులు వేరు, వాళ్ళ వాళ్ళ సమీకరణాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు గ్రామాల్లో ఆబ్జెక్టివ్ గా పరిసిలిన్చల్సిందే..గంతే..

ఇపుడు రైల్ రోకో అంటున్నాం, సోనియమ్మ మల్లా డిఎస్ ని పిలుస్తది , ఆయనకి తిని తిని వళ్లే కదలదు, ఇంత తిన మరిగినోడికి తెలంగానోస్తే పెద్ద దెబ్బే, అందుకని ఏమ్లె మేడం అంత ఒకే అంటడు..ఆంధ్రల బిసినెస్లు దెబ్బతింటై కాదె అన్న! కేంద్రం చదరంగం ఆడుతుంది, అన్ద్రోల్ల, దొంగ తెలంగానోల్ల చేతిలో ఉంది, మనం కబడ్డీ ఆడుతున్నాం..ఎట్లా వస్తది తెలంగాణా చెప్పుండ్రి. నాన్ కో ఆపరేషన్ ..కోట్లు నష్టం ..అయినా ఎం కాదు కిరణ్ రెడ్డి గాడికి (గార్లు బూరెలు అనే ఓపిక లేదు ప్లీస్) ఎం లేదు అమ్మ! అంత శాంతం ప్రశాంతం అని చెప్తాడు , అది ఒక చానెల్ వాడు ఎస్తాడు ,ఒక అతి తెలివి వెధవ పెద్ద స్టోరి చేస్తాడు, అది చూసి మనకు మల్లా గుబులు..అసలు ఇంత పెద్ద భారత దేశానికి, శ్రీలంక టైగర్ని చంపిన పేరున్న చిదంబరానికి, తెలంగాణాల ఏమైతుందని తెలుసుకోవడానికి తెలంగాణా అన్టేందో తెలవని బెకార్గాడిని అడుగుతారు..ఇది మనం నమ్మాలే..ఇంక నిఘా విభాగాలు, సైన్యాలు అవసరం లేదు మన దేశానికి, అది చూసి .. మనం పిచ్చోళ్ళ లెక్ఖ చూస్తాము.

నిజంగా మనం తలచుకుంటే తెలంగాణా రాదా? సింగరేణి తలచుకొంటే , ఎన్టిపిసి బంద్ పెడితే, కొల్లగొడుతున్న వనరులను ఆపేస్తే తెలంగాణా రాదా..క్విట్ తెలంగాణా అంటే తెలంగాణా రాదా? శాంతం , శాంతం, ఆరు వందల చావులు ..అయినా శాంతి మంత్రం..రేపటికి జీతాలు లేవు, కాలే కడుపులు, ఆక్రోశించే జీవితాలు ..అస్తవ్యస్తమైన సమూహాలు..కుళ్ళి పోయిన రాజకీయాలు..బయట పడుతున్న కుతంత్రాలు. అయినా ఎక్కడో ఒక వెలుగు రేఖ ..వేగు చుక్క..రైలు పట్టాలేక్కుతుంది, సరిగ్గా, మళ్లీ దిగకుండా, మరెక్కడా ఆగకుండా, గమ్యం చేరే దాకా. పల్లె పల్లె భుజానేసుకుంది తెలంగాణని, ఇంక ఆగదు, ఇపుడు తెలంగాణా మేధావుల చేతిలో లేదు, రాజ కీయ నాయకుల లేక్ఖల్లో లేదు, లక్ష కోట్ల నినాదాలతో , గళాలతో గొంతెత్తి అరుస్తోంది జై తెలంగాణా అని, నై తెలంగాణా అన్నోడిని ద్రోహి అని పక్కకు తోసి ముందుకు పోతుందీ..ఎవడికైనా దమ్ముందా ఆపనికి ..అయితే ఒక సవాలిసురుతుంది నా పల్లె తెలంగాణా, ఆపగలరా? శాంతి మంత్రాల ద్వారా తెలంగాణా రాదనీ మాత్రం అర్థం ఐంది. విద్వంసం అంటే భయం, అయినా శతాబ్దాలుగా భరిస్తూనే ఉంటాం.

ఇన్ని రోజులు వోట్లు , సీట్లు, రాజీలు, రాజీనామాలు, తెలంగాణా రాలే, పోయిన భూములు, నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు..లిక్ఖలేని ప్రాణాలు..పూలమ్మిన చోట కాయలమ్ముకొంటున్నాం..అయినా తెలంగాణా రాలే..ఇపుడు తేలింది ఒకటి..ఉద్యమాలే శరణ్యం అని, వత్తిడే మార్గం అని, నిన్నటికి నిన్న విద్యార్థులు చలో అసెంబ్లీ అంటే కొన్ని పార్టీలు మద్దతు తెలపవు, ఎందుకు అని అడగొద్దు..(చిదంబర రహస్యం కాదు చంద్ర శేఖర రహస్యం , దాని పేరు శాంతి అందురు..అసలు ఎంత శాంతి తెలంగాణా ల ఉందొ చూడాలంటే నిజమైన ఉద్యమ కారులని అడగాలే. ఎం చెప్పలే అక్కా! చావలేక బతక లేకున్నం, మేము మనోల్లతోని కొట్లాదాలే, అవతలోనితోటి కొట్లాదాలే..బతుకంతా కోట్లాటనే అని గొల్లు మంటారు..అయినా పోరాటం ఆపరు). మారణ కాండ జరుగుతుంది.. రక్తం చిమ్ముతుంది, కాంపస్ లు పోలిస్ కాంప్ లైతై, సైన్యం గుప్పిట్లో విద్యార్థులు, రాళ్ళు, రబ్బరు బుల్లెట్లతో స్నేహాలు, అయినా వారికి మనం దూరంగా ఉంటాం, వారిది విప్లవం భై అంటాం, అన్టేందో అర్థం తెలవాలంటే చేగువేరాని చదవాలి..విద్యార్థుల ఆవేశంని, క్రిఎటివిటిని మనం ఉద్యమానికి వాడుకోలేము. కాని వాళ్ళు (అసలు వాళ్ళు ఏందో మనం ఏందో) మాత్రం మనం ఏ పిలుపు ఇచిన మేము సైతం అని ముందు పడతారు..అదే తేడా. ఇక్కడ గాంధీలు ఉంటారు, భగత్ సింగ్లు ఉంటారు..ఎవరు ఎక్కువ , ఎవరు తక్కువ కాదు, అందరు దేశం కోసమే అనేది నీతి. ఇప్పుడున్న సందర్బంల, ఎవరు ఏ పిలుపునిచ్చినా మనం అందరం కలిసి పోరాడాలే..అదే ఉద్యమానికి బలం. కొన్ని పార్టీలు సగం మందిని తన గుప్పిట్లో పెట్టుకొని, పోరాటాలకు పోకుండా చేస్తారు ..పోతున్న వనరులని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తాం..తెలంగాణా రాని అపుడు మాట్లాడుదాం అంటాం, తరువాత ఏముంటది బూడిద, ఆస్థి పంజరాలు, కరీం నగర్ల గ్రానైట్ మైనింగ్ ల ఇరవై శాతం మాత్రమె మన వాళ్ళు ఉంటారు, అంత బయటి వోల్లు తవ్వక పోతుంటారు, మనం వాళ్లకు సహాయం చేస్తుంటాం, పైసల్ రా భై! ఇక్కడ తెలంగాణా వాదం అడ్డు రాదు. అసలు తెలంగాణా అంటే భూములు, నీళ్ళు , ఉద్యోగాలు కాదు ! డబ్బుకు కులం, మతం, నమ్మకాలు, సెంటిమెంట్లు లేవు సారూ.

సోది చాన అయినట్టుంది..క్షమించున్ద్రి..సోది కాదె, గోస..పానం ఒపుతలేదు..ఒక్కో పిలుపు వెనక ఎంత హింస ఉంటదో చూస్తున్నాం..రేపటి పిలుపుకి విరిగే లాథిలెన్నో, చిందే రక్తం ఎంతో, పేలే గన్నులెన్నో, పోయే పానాలెన్నో..ఏమి కాకుంటే, పోకుంటే శాంతి, పొతే ఆవేశం..సింపుల్, చివరాకరికి .ఎక్కిన రైలు బండిని గమ్యం చేరేదాక తీసుక పోదాం, మన సిద్ధాంతాలన్నీ , పైత్యాలని పక్కన పెడదాం..ప్రజలేమంటే అదే నిర్ణయం. టునిసియా, ఈజిప్ట్, లిబియ పోరాటాలు రోజులలోనే నడచినాయి , వొట్లతోటి, సీట్లతోటి, మాటల గారడి తోటి కాదు.అక్కడ అశేష ప్రజా స్రవంతికి, వారి ఆకాంక్షలకి అడ్డు పడే వాడు లేదు, పేర్లు పెట్టే వాడు లేదు. మంచిదా , చెడ్డదా అని కాదు సమస్య..ప్రజల చేతిలోకి వెళితే వాళ్ళే చూసుకొంటారు..అలా వేల్లోద్దని మన నాయకులు అనుకుంటున్నారు, థిస్ ఇస్ టూ లేట్ నవ్! వెయిట్ అండ్ సి ది రిసల్ట్.

” నీ బాణానికి గురి ఎవడో శత్రువు, నా బాణానికి గురి ఏదో హృదయం;
గాలి వాలు తెలిసి ఎగిరే పక్షివి నీవు ,
గాలి కూడ భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను” (ఎం పరేషాన్ చేస్తార్ర భై ఈ కవులు)

జై తెలంగాణా!

Sujatha surepally

No comments: